Thursday, January 26, 2023

సిబిఐ, ఈడీ విశ్వసనీయత ఎంత?

 సిబిఐ, ఈడీ విశ్వసనీయత ఎంత?

ABN , First Publish Date - 2023-01-11T00:39:29+05:30 IST


‘దేశంలో ఆర్థిక కుంభకోణాలు జరిగినప్పుడు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రవేశించినప్పుడల్లా ఆ కేసుల విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని మా అనుభవం చెబుతోంది. ఏళ్ల తరబడి విచారణ సాగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు ఎన్ని ఆర్థిక కుంభకోణాలకు పరిష్కారాలు లభించాయో మీరు చెప్పగలరా?’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ సి.టి.కుమార్‌లు గత వారం ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సిబిఐ, ఈడీ సంస్థల తరఫున న్యాయవాదులు సమాధానం చెప్పలేకపోయారు. దాదాపు పదేళ్ల క్రితం ఒడిషా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో దాదాపు పదివేల కోట్ల మేరకు సామాన్య ప్రజలనుంచి వసూలు చేసిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. నిజానికి 2014లోనే సుప్రీంకోర్టు ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించినప్పటికీ ప్రజలకు సిబిఐ న్యాయం చేయలేకపోయింది. ‘వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు న్యాయం చేసే విషయంలో సిబిఐ డైరెక్టర్‌కు సమయం లేదా? పదేళ్లు, ఇరవై ఏళ్లు, ముప్పై ఏళ్లు... ఇలా విచారణకు ఎన్నేళ్లు పడుతుంది? విచారణ ప్రారంభించిన తర్వాత ఎంతమందికి డబ్బు చెల్లించారు?’ అని సిబిఐని కోర్టు నిలదీసింది. ఈ కుంభకోణానికి పాల్పడిన వారు ఇంకా ప్రజల డబ్బును అనుభవిస్తున్నారని, ఆ డబ్బుతోనే కేసులు వాదిస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చాలా కేసుల్లో ఈ అక్రమ డబ్బు షెల్ కంపెనీల సహాయంతో విదేశాలకు తరలిపోతోందని, ఒకసారి నిందితులు విదేశాలకు పారిపోయాక వారిని దేశానికి రప్పించేందుకు అక్కడ కోర్టుల చుట్టూ మనం తిరగాల్సి వస్తోందని కూడా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.


ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే సిబిఐ పనితీరుపై వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముఖేష్ కుమార్ రసిక్ భాయి షా గతంలో అయిదున్నరేళ్లు సిబిఐ తరఫున న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహించారు. గుజరాత్‌కు చెందిన జస్టిస్ షాకు సిబిఐలో జరుగుతున్నదేమిటో బాగా తెలుసు. సిబిఐలో కస్టమ్స్ , ఎక్సైజ్ విభాగాలనుంచి అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకువస్తారని, వారికి దర్యాప్తులో అనుభవమే ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్న విషయాలకూ సిబిఐలో సమయం పడుతుందని, ప్రతి చిన్న విషయానికీ డైరెక్టర్ అనుమతి కావాలని ఆయన అన్నారు. వ్యవస్థల్ని మార్చకుండా జరిగేదేముండదని ఆయన చివరకు అభిప్రాయపడ్డారు. మరో అయిదునెలల్లో పదవీవిరమణ చేయనున్న జస్టిస్ షాకు తన హయాంలో కూడా చిట్‌ఫండ్ కుంభకోణంలో న్యాయం జరిగే అవకాశాలు తక్కువేనని తెలియకపోలేదు. అంతకు ముందు గత న్యాయమూర్తుల హయాంలో కూడా ఎన్నోసార్లు ఈ చిట్‌ఫండ్ కుంభకోణాల విచారణలు జరిగాయి. దర్యాప్తు సంస్థలు పలుసార్లు సుప్రీంకోర్టు మందలింపులకు కూడా గురయ్యాయి. కాని చివరకు న్యాయమూర్తులు, సిబిఐ డైరెక్టర్లు మారడమే కాని ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువ.


జస్టిస్ షా పేర్కొన్నట్లు ఒకసారి డబ్బు విదేశాలకు తరలి వెళ్లి, నిందితులు పారిపోయిన తర్వాత ఆ దర్యాప్తునకు ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు. లుక్ అవుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులకే చాలా సమయం పడుతుంది. ఫలానా దేశంలో కోర్టు విచారిస్తోందని, ఎప్పుడైనా నిందితులను సిబిఐ దేశానికి తీసుకురావచ్చని పత్రికల్లో చాలాసార్లు పతాక శీర్షికల్లో వార్తలు వస్తాయి. ఆర్థిక అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారయిన 72 మంది భారతీయుల్లో ఎంత మందిని, ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చారు? ఇప్పటికి ఇద్దర్ని మాత్రమే తీసుకురాగలిగారని ఒక ఆర్టీఐ సమాచారాన్ని బట్టి తేలింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, నీషల్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి ఎందరో వ్యాపారులు తమ కుటుంబాలతో సహా విదేశాల్లో ఉన్నారు. వీరు కాక పరేఖ్‌లు, పటేల్‌లు, గోయల్‌లు ఎందరో! ఎంతమందిని ప్రభుత్వం తీసుకురాగలిగింది? తీసుకువచ్చిన వారిలో పదికోట్ల నుంచి 40 కోట్ల వరకు బ్యాంకులను మోసం చేసిన వారు ఉన్నారు కాని వందలాది కోట్లను మింగిన తిమింగలాలను ఇంకా భారత ప్రజలు చూడాల్సి ఉన్నది. కొన్ని కేసుల్లో ఆస్తులను అమ్మి బ్యాంకులు కొంతవరకు డబ్బును సమకూర్చుకోగలిగాయి కాని ప్రభుత్వం నిందితులకు శిక్షపడేలా మాత్రం చేయలేకపోయింది. భారత ఏజెన్సీల కళ్లు కప్పి వారు విదేశాలకు పారిపోయారంటేనే మన ఏజెన్సీలు ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయో అర్థం అవుతుంది. విదేశీపర్యటనలకు, అక్కడి కోర్టుల్లో వాదించేందుకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయో కూడా చెప్పలేం. ఒక సందర్భంలో మెహుల్ చోక్సీని భారతదేశానికి తీసుకువచ్చేందుకు ప్రైవేట్ విమానాన్ని కూడా డొమినికాకు తీసుకువెళ్లారు. తాను భారతదేశ పౌరుడినే కాదని వాదిస్తున్న చోక్సీ అక్కడి నుంచి తాను నివసిస్తున్న ఆంటిగువాకు వెళ్లిపోయారు.


విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు ముగ్గురే దాదాపు రూ. 23 వేల కోట్ల మేరకు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. తాము అవినీతిపై తీవ్ర పోరాటం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని లూటీ చేసిన వారిని విదేశాలనుంచి రప్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ ప్రకటనలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనన్న అనుమానాలు లేకపోలేదు. ఇంతవరకూ ఒక్క ఆర్థిక నేరస్థుడి పేరు కూడా ఆయన ప్రస్తావించలేదు. పైగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కార్పొరేట్లకు భారీ రుణాలు లభిస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా లక్షల కోట్ల మేరకు ఈ రుణాలను రద్దు చేస్తున్నట్లు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటిస్తూనే ఉన్నారు. సంపద సృష్టించేవారికి పెద్దఎత్తున రుణాలు ఇవ్వండి అని 2021లో జరిగిన ఒక సమావేశంలో ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రక ఎన్నికలు వచ్చేలోగానైనా ఒక్క మహా ఆర్థిక నేరస్థుడినైనా ఆయన దేశానికి తీసుకువచ్చి జైలుకు పంపించగలరా అన్నది తేలాల్సి ఉన్నది.


కోర్టుల ద్వారానో, మరో రకంగానో సిబిఐ ఆర్థిక నేరాలను విచారిస్తున్నది కనుక మనకు కనీసం సమాచారం తెలుస్తోంది. కాని దేశంలో అనేక చోట్ల సిబిఐ దాకా రాని అనేక భారీ ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో పదివేల కోట్ల రూపాయల మేరకు ఆదివాసీల నుంచి చిట్‌ఫండ్‌ల పేరుతో లూటీ చేశారని, ఇది శారదా కుంభకోణం కంటే ఎంతో పెద్దదని గుజరాత్‌కు చెందిన ఎన్జీవో ‘ఏక్ ఆవాజ్–ఏక్ మోర్చా’ సంస్థ కన్వీనర్ రోమెల్ సుతారియా కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. ఇలాంటి ఆర్థిక నేరాలపై ఎప్పుడో ఒకప్పుడు కోర్టులు పట్టించుకుని సిబిఐ, ఈడీ విచారణకు ఆదేశించినా సరిపోదు. సిబిఐ, ఈడీల విశ్వసనీయత మాత్రం ఎంత?


అసలు బ్యాంకుల నుంచి వేల కోట్లు లూటీ చేసిన వారి గురించి ప్రజలకు ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? వారి పేర్లను ఎందుకు దాచిపెడుతున్నది? రిజర్వు బ్యాంకు వర్గాల ప్రకారం 312 మంది బడా వ్యాపారులే 72 శాతం మేరకు బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టారు, అయినప్పటికీ ప్రభుత్వం ప్రజల డబ్బును వారికి దోచిపెడుతూనే ఉన్నది. శ్రీలంకలో జీడీపీ కంటే రెండు రెట్లు ఎక్కువగా బ్యాంకులకు రావల్సిన రుణాలు ఉన్నాయన్నది ఒక అంచనా. బ్యాంకులు గత అయిదేళ్లలో రాబట్టిన రుణాలకు రెట్టింపు మేరకు రాని బాకీలు (నిరర్థక ఆస్తులు) పెరిగిపోయాయి. బ్యాలన్స్ షీట్లు ఆరోగ్యంగా ఉండేందుకు, పన్నుల ప్రయోజనాలను పొందేందుకు నిరర్థక ఆస్తులను రద్దు చేస్తున్నాము కానీ రుణాలను వసూలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని చెప్పిన ఆర్థిక మంత్రికి రద్దు చేసిన రుణాల్లో 87 శాతం మేరకు తిరిగి రాలేదని తెలియదా? బ్రిటన్, మలేషియా, చైనా, ఇండోనేషియా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో కంటే నిరర్థక ఆస్తుల నిష్పత్తి ఎక్కువగా భారతదేశంలోఉన్నదన్న విషయం ఆమెకు ఎవరూ చెప్పనక్కర్లేదు. రిజర్వు బ్యాంకు డేటా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు రూ.11,17,183 కోట్ల మేరకు రుణాలను రద్దు చేశామని, కేవలం 13 శాతం మాత్రమే వసూలు చేసుకోగలిగామని గత సమావేశంలో ఆర్థిక మంత్రే స్వయంగా వెల్లడించారు.


చిట్ ఫండ్ కుంభకోణాల విషయంలోనే కాదు, ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకులపై ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో కూడా సిబిఐ, ఈడీ సంస్థలు దర్యాప్తును ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తూ సుప్రీంకోర్టు చీవాట్లు తింటూనే ఉన్నాయి. జస్టిస్ షా మాత్రమే కాదు, సిబిఐ విచారణ చేపట్టిన తర్వాత శిక్షలు పడ్డ కేసులు చాలా తక్కువ అని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీయే పేర్కొంది. 1025 కేసుల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నదని, వీటిలో 66 కేసుల విచారణ అయిదేళ్లుగా సాగుతోందని, కొన్ని కేసులు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని ఈ కమిటీ తెలిపింది. సిబిఐ విశ్వసనీయతపై నమ్మకం లేక పశ్చిమ బెంగాల్, తెలంగాణతో సహా 9 రాష్ట్రాలు సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నప్పటికీ కోర్టుల ద్వారా ఈ రాష్ట్రాల్లో ప్రవేశించిన సిబిఐ సాధించినదేమిటో ఎవరూ చెప్పలేరు. అసలు సిబిఐలో కేస్ మేనేజిమెంట్ వ్యవస్థే లేదని, అందువల్ల పారదర్శకత, జవాబుదారీ విధానానికి ఆస్కారం లేకుండా పోయిందని, రాజకీయాలు విచారణను ప్రభావితం చేస్తున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘమే అభిప్రాయపడింది. వ్యవస్థల విశ్వసనీయత పెంచకుండా, నేరస్థులను చట్టప్రకారం శిక్షించనప్పుడు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నా ప్రయోజనం ఏమిటి? ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఫలితం ఏమిటి?


ఎ. కృష్ణారావు


(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)


No comments:

Post a Comment